లౌకికతత్వ రాజ్యాంగాన్ని పాతరేసిన పౌరసత్వ సవరణ చట్టం 2019
పౌరసత్వ సవరణ చట్టంతో మోడి షా ప్రభుత్వం దేశంలో మంటల్ని రాజేసింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాపితంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారత లౌకిక రాజ్యాంగానికి భిన్నంగా ఈ చట్టం రూపొందించబడింది. లౌకిక రాజ్యంలో మత ప్రాతిపదికన పౌరసత్వ చట్ట సవరణ తీసుకరావడం ఏమిటన్నది అందరూ సంధిస్తున్న ప్రశ్న. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తెచ్చిన ఈ చట్టాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నారు. దేశ వ్యాపితంగా లౌకికవాదులు, యూనివర్సిటీ విద్యార్థులు, పౌర సంఘాలు నిరసనలు తెలుపుతున్నారు. వివిధ ప్రాంతాలలో లక్షలాది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. స్వతంత్ర అనంతరం దేశ ప్రజలు మొదటిసారిగా పెద్ద ఎత్తున కదిలి భారత లౌకికతత్వ రాజ్యాంగానికి తూట్లు పొడిస్తే సహించేది లేదంటూ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు.
మోడి షా ప్రభుత్వం ఈ చట్ట సవరణ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి మతపరమైన వేధింపులతో వచ్చే వారి కోసం చేశామని చెబుతున్నారు. ప్రతి పక్షాలు కుట్రపూరితంగా ప్రజలను రెచ్చ గొడుతున్నాయంటున్నారు. శరణుకోరి వచ్చిన వారికి అశ్రయం ఇవ్వడం భారత సాంప్రదాయమంటూ మాట్లాడు తున్నారు. వాస్తవానికి భారత పౌరసత్వ చట్టం - 1955 ప్రకారం నిబంధనలకు లోబడి పౌరసత్వం ఇచ్చే అవకాశం వుంది. చట్ట విరుద్దంగా దేశంలోకి ప్రవేశించిన వారిని వెనక్కి పంపడానికి “ఫారినర్స్ ట్రిబ్యునల్” వుంది. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి కొత్తగా చట్ట సవరణ చేయాల్సిన అవసరమే లేదు.
పౌరసత్వ సవరణ చట్టం 2019 (సీఏఏ) ద్వారా బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి 2014 డిసెంబర్ 31కి ముందు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, బౌద్ధులకు పౌరసత్వం ఇవ్వవచ్చు. వలస వచ్చిన ముస్లింలకు ఈ సవరణ చట్టం పౌరసత్వాన్ని తిరస్కరిస్తుంది. మతపరమైన వేధింపులతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుండి వచ్చిన శరణార్థులకు మాత్రమే భారత ప్రభుత్వం ఎందుకు ఆశ్రయం ఇవ్వదలచుకొంది? మన పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాలను ఎందుకు మినహాయించారు? శ్రీలంకలో తమిళులు, మయన్మార్ లో రోహింగ్యాలు, పాకిస్తాన్ లో షియాలు, అహ్మదీయలు, భూటాలో క్రిస్టియన్లు వివక్షతను, దాడులను, దారుణ హింసను ఎదుర్కొంటున్నారు. జాతి మత హింసలను తట్టుకోలేక వచ్చిన వారికి ఇప్పటి వరకు భారత దేశం ఆశ్రయం ఇచ్చిన చరిత్ర వుంది. మన కళ్ళ ముందే బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నసీతక్కు ఆశ్రయం ఇచ్చిన విషయం మన అందరికీ విధితమే. భారత పౌరసత్వ చట్ట ప్రకారం జాతి, మత, లింగ, ప్రాంతీయ వివక్షతలు లేకుండా పౌరసత్వం, ఆశ్రయం ఇచ్చే అవకాశం వుంది. ఇప్పటి వరకు భారత పౌరసత్వ చట్టానికి లేని మత ప్రాతిపదికను కొత్తగా ఈ చట్టం తేవడం ద్వారా మోడి షా ప్రభుత్వం తీసుకొచ్చింది. మతపరంగా పౌరసత్వం ఇవ్వడమంటే మత వివక్షను పాటించడం. కుల, మత, జాతి, లింగ, ప్రాంత వివక్షతలను తిరస్కరిస్తూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక రాజ్యాంగంగా గుర్తించబడిందని మనం చెప్పుకుంటున్నాం. ఈ లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా మోడి షా ప్రభుత్వం వివక్ష పూరితంగా పౌరసత్వ చట్ట సవరణకు పూనుకొన్నది. ప్రపంచంలోని హిందువులందరికీ అశ్రయం ఇస్తామని ప్రకటిస్తున్నది. ఇజ్రాయిల్ ని గుర్తు చేస్తుంది. భారతదేశాన్ని హిందువుల నివాసంగా ప్రకటించాలని బీజేపీ ప్రయత్నంలో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టం (ఏఏ) తెచ్చారు. దానితోపాటుగా జాతీయ పౌరసత్వ నమోదు (ఎస్ఆర్)తో దేశంలో కోట్లాది ప్రజల పౌరసత్వంపై సందేహాలను కలిగించి వారి జీవితాలని ప్రశ్నార్థకంగా మార్చే ప్రక్రియకు మోడి షా ప్రభుత్వం చేస్తుంది.
విదేశాల నుండి వచ్చిన శరణార్థులను పరిశీలించి అర్హత ఉన్న వారికిచ్చి మిగతా వారిని వెనక్కి పంపడం వరకే మోడి షా ప్రభుత్వం పరిమితమయి మాట్లాడటం లేదు. దేశ వ్యాపితంగా పౌరసత్వ నమోదు ఎస్ఆర్సీ ప్రక్రియను చేపడతానని ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా నిరసనల వెల్లువ తర్వాత దేశ వ్యాపిత నమోదు గురించి ప్రకటించలేదని సాక్షాత్తు మోడి బహిరంగ సభలో ప్రకటించారు. తిరిగి బీజేపీ దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికీ, పౌరసత్వ నమోదుకు అనుకూలంగానూ ప్రచార కార్యక్రమం చేపట్టింది. ప్రజల మధ్య చిచ్చును రగిలిస్తుంది.
ఈశాన్య రాష్ట్రాలలో పౌరసత్వ నమోదుకు 2013లో సుప్రీం కోర్టు ఆదేశించింది. అస్సాం పౌరసత్వ నమోదులో 3 కోట్ల 29 లక్షల మంది మేము భారతీయ పౌరులమంటూ దరఖాస్తు పెట్టుకొన్నారు. 2019 ఆగస్టు 31 నాడు కేంద్ర ప్రభుత్వం 19 లక్షల మంది భారతీయులు కాదని ప్రకటించింది. అందులో భారత సైన్యంలో 30 ఏళ్ళ పనిచేసిన సుబేదార్ మొహ్మద్ సనా ఉల్లాను విదేశీయుదని భారత ప్రభుత్వం ప్రకటించింది. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీతో పోరాడిన వ్యక్తిని విదేశీయుడిగా డిటెన్షన్ సెంటర్ లో బంధించారు. పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల రాష్ట్రపతి బంధువులు కూడా విదేశీయులుగా పరిగణించబడ్డారు. ఈ స్థితిలో సవరణ చట్టం 2019 అమలుకు తెచ్చారు. దీనితో దేశం వెలుపల నుండి వచ్చిన ముస్లింలతోపాటుగా దేశవాసులుగా ఆధారాలు చూపించలేని వారందరికి కూడా పౌరసత్వం నిరాకరించే అవకాశం ఉంది. అస్సాంలో అనర్హులుగా ప్రకటించిన వాళ్ళలో 14 లక్షు వరకు హిందువులే వున్నారు. డిటెన్షన్ సెంటర్లలో వందలాది మంది ఉన్నారు. అన్యాయంగా మగ్గిపోతున్నారు. దేశ వ్యాప్త ఎన్నార్ సి సమస్య కేవలం దేశంలోని 20 కోట్ల ముస్లింలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. రికార్డులు చూపలేని అందరికి సమస్యే. ప్రధానంగా గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యులు, గిరిజనులు, దళితులు, మహిళలు, వలస కార్మికులుబడుగు బలహీన వర్గాలే బలవుతాయనే ఆందోళన సర్వత్రా నెలకొంది. పౌరసత్వ నమోదుకు అవసరమయ్యే రికార్డుల కోసం వీరంతా వారి తాత, ముత్తాతల వివరాల కోసం ఎక్కడికి పరుగులు తీయాలి? ఎన్ని రోజులు పనులు మానుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి? పనిచేయకపోతే పస్తులు వుండే వారి పరిస్థితి వూహించడానికే కష్టంగా వుంది.
మోడిషా ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యల నుండి దృష్టి మళ్ళించడానికి కొత్త కొత్త సమస్యలను సృష్టించడంలో దిట్ట. 2016 పెద్ద నోట్ల రద్దుతో పేద మధ్యతరగతి ప్రజల్ని నానా ఇబ్బందుల పాలు చేశారు. మధ్య తరగతి వర్గాలను బ్యాంకుల చుట్టూ తిప్పించారు. పేదలకు పనులు లేకుండా పస్తులతో గడపాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడిక, 60 వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి పౌరసత్వ నమోదు ప్రక్రియ చేపట్టి దేశ ప్రజలను ఇక్కట్ల పాలు చేయడానికి పథకం వేశారు. దేశ వ్యాపిత నిరసనతో పౌరసత్వ నమోదు ప్రక్రియను పక్కన పెట్టి జనాభా లెక్కల నమోదు కార్యక్రమాన్ని ముందుకు తెచ్చారు. ఈ జనాభా లెక్కల్లో గతంలోలాకాకుండా కొత్త కాలమ్స్ పెట్టారు. మీ తాత ముత్తాతలు ఎక్కడ జన్మించారనే విషయాన్ని కూడా ధృవీకరించాల్సి వుంది. అంటే పౌర నమోదు ప్రక్రియకు జనాభా లెక్కల నమోదుతో వివరాల సేకరణ మొదలు పెట్టారు. ఈ దేశ పౌరులు ఎవరనేది తెల్చేందుకు చట్టాలున్నాయి. దాంతో ఇప్పటి వరకు పౌరులమేనని రుజువు చేయాల్సిన బాధ్యత లేని స్థితి నుండి రుజువు చేసుకోవాల్సిన భారం పడింది. ఆధార్, ఓటు హక్కు ధృవీకరణ, ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకా తాత ముత్తాతల వివరాల సేకరణ అంటూ ప్రజల జీవితాలతో ఆటలాడటానికి ప్రభుత్వం పూనుకొన్నది.
ఈ దేశ పౌరులమేనని నిరూపించుకోలేక తమ జీవితాలను అంతం చేసుకుంటున్న ఉదంతాలను సాక్షాత్తు బెంగాల్ ముఖ్యమంత్రి మమత పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలు ఎస్ఆర్సీ అమలుకు అనుమతించమని ప్రకటించారు. మతం ఆధారంగా పౌరసత్వాన్ని ముందుకు తీసుకరావడంతో మోడీ షాలకు ఉన్న లక్ష్యం స్పష్టమవుతుంది. బహుళజాతుల, మతాల సంస్కృతులతో విరాజిల్లుతున్న భారత దేశ లౌకిక రాజ్యాంగాన్ని హిందు మత రాజ్యాంగంగా మార్చే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టం చేశారు. ఇప్పటికే జైశ్రీరామ్ అన్నవాళ్ళే ఈ దేశంలో ఉండాలనీ, ఈ దేశ గ్రంథంగా భగవద్గీత ఉండాలనీ, జైశ్రీరామ్ అనకుంటే దేశభక్తి లేదనీ, హిందువు అయితేనే భారత దేశంలో ఉండాలనే వాదనలు చేసిన ఆర్ఎస్ఎస్, సంఘపరివార్ మాటలకు చట్ట రూపం మోడి షా ప్రభుత్వం తెచ్చింది. రాజ్యాంగం యొక్క లౌకికతత్వానికి తిలోదకాలిచ్చింది.
దేశంలో ఆర్థిక మాంద్యం పెరిగి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలను కోల్పోతున్నారు. బీఎస్ఎన్ఎలో 98 లక్షల మంది ఉద్యోగాలు, మోటార్ పరిశ్రమల్లో లక్షలాది ఉద్యోగాలు, ఐటి ఉద్యోగాలు కోల్పోతున్నారు. ధరల పెరుగుదల లాంటి మౌలిక సమస్యల పరిష్కారం చూపలేని ప్రభుత్వం మరోవైపు దేశ సమగ్రత, సమైక్యతలకు ముప్పు తెచ్చే విధంగా వ్యవహరిస్తుంది. మత ప్రాతిపదికపై ప్రజలను చీల్చి తన అధికారాన్ని పదిలపరుచు కోవడానికి ప్రయత్నిస్తుంది. పౌరసత్వ చట్ట సవరణను (సీఏఏ) జాతీయ పౌరసత్వ నమోదు (ఎస్ఆర్)ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై దాడులు నిర్వహిస్తుంది. ప్రజలు, విద్యార్థులు శాంతియుతంగా నిరసనలు తెలియచేస్తుంటే భౌతికదాడులకు, హింసను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. జామియా మిలియా, ఆలిఘడ్, మౌలానా ఆజాద్, జెఎన్‌యూ యూనివర్సిటీలపై దాడులు హింస మొదలు పెట్టారు. లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికీ, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని దెబ్బ తీయడానికి మోడిషా పాలకులు చేస్తున్న కుట్రలను త్రిప్పి కొడదాం. రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని కాపాడుకొందాం.