| నమ్మకం

-- డా.ఆలూరి విజయలక్ష్మి....


కోపంతో ఉబ్బిన భర్త ముఖం కళ్ళ ముందు నిలిచి వేదను భయపెడుతూంది. పెద్దగా తిడుతూ అతను చేసిన హెచ్చరిక పదే పదే చెవుల్లో మోగుతూంది. ఈసారి బిడ్డ కూడా దక్కక పోతే ఇక తనకు పుట్టిల్లేగతి, తమ ఇంటికి తీసుకెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి వెళ్ళిపోయాడు. జరుగుతున్నదంతా ఒక పీడకలలాగా అనిపిస్తూందామెకు


శ్రద్ధగా చదువుకుంటూ పై చదువు, పెద్ద ఉద్యోగం, మంచి జీవితం గురించి తను కంటున్న కలల్ని చిదిమేసి పదహారో సంవత్సరం నిండీ నిండకుండానే, పదో తరగతి పరీక్షలవగానే పెళ్ళి చేసేసారు. బయటి ఊర్లో కాలేజిలో చేర్పించి చదివిస్తే వచ్చే సమస్యలన్నిటిని ఏకరువు పెట్టి, వాటన్నిటినీ తట్టుకోగల శక్తి తమకు లేదని, ఐనా, సరైన వయసులో ఆడసిల్ల పెళ్ళి చేసి పంపించడమే తమ కుటుంబ ఆచారమని చెప్పి, పెళ్ళి ఒద్దు, చదువుకుంటానని తనెంత మొత్తుకున్నా వినకుండా పెళ్ళి చేసేసారు. ఇంక పెళ్ళయిన దగ్గర్నుండి పిల్లల గురించి అత్తగారి గోల.


“మోహన్ పుట్టాక ఇంకో బిడ్డ కోసం ఎన్ని పూజలు, వ్రతాలుచేసానో చెప్పలేను. కాని ఆ దేవుడు దయతల్చలేదు. మోహన్ ఒక్కడే ఇంట్లో తిరుగుతోంటే ఇంకా ఇద్దరు, ముగ్గురన్నా పిల్లలు వాడికి తోడుగా వుండుంటే ఇల్లు కళకళలాడుతూ ఉండేదికదా అనిపించేది.... ఇదిగో వేదా! ఏడాది తిరిగేసరికల్లా నా మనవడి కేరింతలో ఇల్లు మోగిపోవాలి.” తను కాపురానికి వెళ్ళిన కొత్తలోనే నెమ్మదిగా, నిక్కచ్చిగా చెప్పింది తన అత్తగారు.


ఆమె కోరుకున్నట్లుగానే మరో రెండు నెలల్లోనే తనకు గర్భం వచ్చింది. తన భర్త, మావగారు, అత్త గారి ముఖాలు సంతోషంతో వెలిగి పోయాయి. ఏడో నెల రాగానే అమ్మ, నాన్న సూడిదలు తెచ్చి తనను పురుటికి తీసుకెళ్ళారు. వెళ్ళిన నాలుగో రోజునే కడుపు నొప్పి వచ్చింది. ఏమన్నా తిన్నది పడలేదేమో, కాస్త వాము


నీళ్ళు తాగితే అదే తగ్గుతుందిలే అని కాసేపు ఓపిక పట్టింది. అంతలోనే భళ్ళున కుండ పగిలినట్లు ఉమ్మనీరు కారిపోయింది. కంగారుగా హాస్పటల్ కి చేరీ చేరగానే పురుడొచ్యేసింది. నెలలు తక్కువ, బరువు తక్కువ బిడ్డ ఊపిరి తీసుకోలేక చనిపోయాడు.


బిడ్డ దక్కలేదనే దు:ఖం ఒక వైపు, తమను దోషులుగా , నిలబెట్టి అత్తింటివారు మాట్లాడిన మాటలు మరోవైపు తననెంతగానో బాధపెట్టాయి. మనసు, శరీరం ఇంకా పూర్తిగా కోలుకోకుండానే మళ్ళీ గర్భం. ఈసారి పుట్టింటికి పంపము, ఇక్కడే మంచి డాక్టరుకి చూపించి సరైన వైద్యం చేయిస్తామని చెప్పి పురుటికి తీసుకువెళ్ళడానికి వచ్చిన నాన్నని అత్తగారు, మావగారు క్రితం సారి బిడ్డ పోవడానికి మీరు సరైన జాగ్రత్త తీసుకోకపోవడమే కారణమంటూ నానా మాటలని వెళ్ళగొట్టారు. ముఖం వాడిపోయి, కళ్లు తడిగా అయి దీనంగా తలదించుకుని వెళ్ళిపోతున్న నాన్నను చూసి తన మనసు విలవిలలాడింది. ఓర్చుకుని, గుండె దిటవు చేసుకుని డాక్టర్ చెప్పిన సూచనలన్నిటినీ పాటిస్తూ, రాసిన మందులన్నిటినీ వాడుతూ ఎలాగోలా ఈగండం గడిచిపోతే బావుండని అనుకుంటూండగా ఒక రోజు కళ్ళు మసకబారి, వాంతులవుతూంటే హాస్పటల్ కి తీసుకు వెళ్ళారు.


డాక్టర్ గారు పరీక్ష చేసి ఇవి గుఱ్ఱపు వాతం వచ్చేముందు లక్షణాలని, తల్లికి, బిడ్డకు కూడా ప్రమాదమని చెప్తూ ఉండ గానే తనకు ఫిట్ వచ్చిందట.. అప్పటికి ఎనిమిదో నెల వచ్చి రెండు రోజులయింది. నెలలు అవనప్పటికి, బిడ్డ సంగతటుంచి తల్లి ప్రాణం కాపాడడానికి వెంటనే సిజేరియన్ చెయ్యాలని డాక్టర్ చెప్తే అత్తవారు మొదట డాక్టర్లు డబ్బుకోసం ఇలాగే హడలుగొట్టి ఆపరేషన్లు చేసేస్తారనే అపోహతో కొంత సేపు, బిడ్డ గురించి ఆలోచిస్తూ కొంత సేపు తాత్సారం చేసి చివరకు ఆపరేషన్ చెయ్యడానికి ఒప్పుకున్నారట. కాని అప్పటికే సమయం మించి పోయింది. బి.పి. పెరిగిపోయి, మాయ విడిపోయి, రక సావం ఎక్కువయి బిడ్డ లోపలే చనిపోయిందని చెప్పారు డాక్టర్ గారు.


బిడ్డ దక్కలేదని అత్తగారు శోకాలు పెట్టింది. తల్లి కడుపు లోంచి బయటపడేలోగానే చనిపోయిన మనవరాలి గురించి దు:ఖపడుతున్నప్పటికి తమ బిడ్డ దక్కింది, అదే పదివేలని అమ్మ, నాన్న మనసుని సరిపెట్టుకున్నారు. తను డిప్రెషన్లో కూరుకు పోయింది. పదే పదే ఆ సంఘటనే కళ్ళముందు కదిలి దు:ఖం ముంచేసేది. రెండుసార్లు ఇలా జరిగింది, అసలు తనకు ఆరోగ్యంగా ఉన్న బిడ్డను కని, పెంచే అదృష్టం ఉందా అని అనుమానపడేది. ఆస్థితి నుంచి నెమ్మది నెమ్యదిగా బయటపడుతూండగా మళ్ళీ గర్భం వచ్చింది. ఈసారి అత్తగారు దెప్పుళ్ళు, సూటిపోటి మాటలు అనడం మాని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది, గడిచిపోయిందాన్ని తలచుకోవద్దని, అంతా సవ్యంగా జరుగుతుందనే నమ్మకంతో ఉండమని ధైర్యం చెప్పింది. మారిన ఆమె ధోరణి చూసి తనెంతో సంతోషపడింది. తమంతట తామే పురుటికి తీసుకు వెళ్ళమని అత్తవారు నాన్నకు కబురు పంపించారు.


డా.శ్రుతితో చూపించుకున్నాక ఇలా నెలలు నిండకుండా ప్రసవమవడానికి కారణమేమిటని అడిగింది వేద.


“చాలా కారణాలుంటాయి.యాదృచ్చికంగా నెలలు నిండక మునుపే నెప్పులు ప్రారంభమై ప్రసవమవొచ్చు, లేక ఉమ్మనీరు సంచి ముందు గానే పగిలిపోవడం వలన ప్రసవమవొచ్చు. ఇలా జరిగే ప్రసవాలలో 45-50 శాతానికి కారణాలు తెలియవు. తల్లికి లేక శిశువుకు గర్భాన్ని కొనసాగించడం వలన ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు, ప్రీఎక్లాంప్సియా, గర్భస్థ శిశువుకు సక్రమంగా ఊపిరి అందకపోవడం, గర్భధారణ వయసుకంటే శిశువు చిన్నదిగా ఉండడం, మాయ విడిపోవడం మొదలైన కారణా వలన 37 వారాలలోపు జనన మార్గం ద్వారా లేక సిజేరియన్ ఆపరేషన్ చేసి శిశువును ప్రసవం చెయ్యవలసి వస్తుంది. గర్భం రాక ముందునుండి ఉన్న అధిక రక్తపోటు, మధుమేహం, రక్తం గడ్డకట్టడంలో లోపాలు మొ., మాయ గర్భాశయంలో క్రింద భాగంలో ఉండడం, కారణం తెలియకుండా యోని ద్వారా బ్లీడింగ్ అవడం, మూత్ర వ్యవస్థ వ్యాధులు, రీసస్ ఐసొఇమ్యునైజేషన్, గర్భస్థ శిశువుకు పుట్టుకతో వైకల్యాలు ఉండడం, ఉమ్మనీరు బాగా తక్కువగా ఉండడం వలన కూడా ముందస్తుగా డెలివర్ చెయ్యవలసి వస్తుంది” శ్రుతి చెప్పేది వింటూ తన గత ప్రసవాలను గుర్తుకు తెచ్చుకుంది వేద.


“ముందస్తు జననాలకు ప్రమాద కారకాలు అనేకం ఉంటాయి. పేదరికం, తక్కువ సాంఘిక, ఆర్ధిక స్థాయి, మరీ బక్కగా, తక్కువ బరువుతో ఉండడం, మరీ పొట్టిగా ఉండడం, గర్భంసమయంలో సక్రమమైన, సుశిక్షితుల సంరక్షణ లేక పోవడం, పోషకాహారలోపం, సూక్ష్మపోషకాల లోపం, విటమిన్. సి లోపం, గర్భవతి వయసు:18 సంవత్సరాలలోపు లేక 40 సంవత్సరాలు పైన ఉండడం, ఇంతకు మునుపు వీటర్మ్ ప్రసవం, 3- 6 నెలల్లో గర్భస్రావాలు, లేక 3 కంటే ఎక్కువ సార్లు గర్భ విచ్ఛేదాలు జరిగి ఉండడం, కవలలు లేక అంతకంటే ఎక్కువ మంది శిశు వులు ఉంటే, గర్భాశయంలో, ఉమ్మనీటిలో, శిశువును చుట్టి ఉండే పొరలు, ప్లాసెంటా లేక మాయకు, సర్విక్స్ కి ఇన్ఫెక్షన్లు ఉండడం, వ్మాధినిరోధక వ్యవస్థను నియంత్రించే జీన్స్ సక్రమంగా లేకపోతే, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో గర్భం వచ్చినప్పుడు, బిడ్డ పుట్టాక వ్యవధి లేకుండా మళ్ళీ గర్భం వచ్చినప్పుడు నెలలవకుండా పురుడు రావొచ్చు.” ఇంతలో వేద రక్త పరీక్షల రిపోర్ట్ రావడంతో వాటిని చూసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది.


"గర్భాశయ నిర్మాణంలో లోపాలు, గర్భాశయం ఆకారం సహజంగా లేకపోవడం, సర్విక్స్ చిన్నదిగా లేక బాగా పొట్టిగా ఉండడం లేక సర్విక్స్ బిగుతుగా లేనప్పుడు, ఇంతకు మునుపు గర్భాశయానికి సంబంధించిన ఆపరేషన్లు జరిగి ఉంటే ముందస్తుగా ప్రసవమవొచ్చు. ఉమ్మనీరు ఉండవలసిన దానికంటే బాగా ఎక్కువ లేక బాగా తక్కువగా ఉన్నప్పుడు. గర్భాశయంలో లూప్ ఉండగానే గర్భం వచ్చి లూప్ ని తొలగించకుండా అలాగే వదిలి వేసినప్పుడు, సిగరెట్లు, మద్యం, మత్తు పదార్థాలు తీసుకోవడం, ఏ కారణం చేతనైనా ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నప్పుడు, శారీరకశ్రమ అధికమైనప్పుడు, వృత్తి, ఉద్యోగం రీత్యా ఎక్కువ సేపు నిలబడడం, ఒత్తిడి నిండిన పని పరిస్థితులు, ఎక్కువ పనిగంటలు ఉండడం, డిప్రెషన్, ఏంక్రయిటీ లేక ఆందోళన, దీర్ఘకాలిక ఒత్తిడి లాంటి మానసిక సమస్యలు, శారీరక, మానసిక, లైంగిక హింస... ఇలా చాలా కారణాలు ఉంటాయి.” శ్రుతి చెప్పింది వింటున్న వేదకు మరో విచారం కమ్ముకుంది.


“ముందస్తుగా పుట్టిన పిల్లలకు ఎలాంటి బాధలు వస్తాయి అమ్మా?” వేద ఆతృతతో అడిగింది. ఈ


“నెలలు నిండకుండా పుట్టడం వలన శారీరక వ్యవస్థలు పూర్తి స్థాయి పరిణతి లేని పరిస్థితిలో వీటర్మ్ శిశువులకు అనేక స్వల్ప కాలిక, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఉపద్రవాలు వస్తాయి. సాధారణంగా ఎంత ముందుగా శిశువు పుడితే అంత ఎక్కువగా సమస్యలు వస్తాయి. పుట్టినప్పుడు శిశువు బరువు మీద కూడా ఇది ఆధార పడుతుంది. కొన్ని సమస్యలు శిశువు పుట్టగానే కనపడతాయి, కొన్ని శిశువు కొంచెం ఎదిగాక కనపడతాయి. ప్లీటర్మ్ శిశువు శ్వాసకోశాలు పరిణతి చెందక పోవడం వలన పుట్టాక శిశువు ఊపిరి తీసు కోవడం కష్టమవుతుంది. ఒకోసారి మధ్య మధ్యలో కొన్ని క్షణాలు ఊపిరి ఆగిపోతుంది. పుట్టుకతో గుండెలో లోపాలు, రక్తపోటు తక్కువగా ఉండడం, హార్ట్ ఫెయిల్యూర్ మొదలైన సమస్యలు రావొచ్చు.” ఇంతలో ఒక గర్భవతి బ్లీడింగ్ సమస్యతో రావడంతో ముందు ఆమెను చూసి మందులు రాసి వచ్చింది శ్రుతి. కలత పడుతూ తన వంక చూస్తున్న వేద భుజాన్ని ఫరవాలేదనే భరోసా ఇస్తున్నట్లు మృదువుగా తట్టింది


“ఎంత ముందుగా శిశువు పుడితే అంత ఎక్కువగా మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. చాలా సందర్భాలలో స్వల్ప రక్తస్రావం ఉండి పెద్దగా నష్టం జరగకుండా తగ్గిపోతుంది. కాని రక్తస్రావం ఎక్కువైతే శాశ్వతంగా మెదడు దెబ్బ తింటుంది. వీటర్మ్ శిశువులు చాలా వేగంగా వేడిని కోల్పోతారు. నెలలు నిండాక పుట్టిన శిశువులకు లాగా వారికి శరీరంలో కొవ్వు నిలవలు ఉండక పోవడం వలన శరీరం కోల్పోయిన వేడిని తిరిగి ఉత్పత్తి చెయ్యలేదు. వేడి బాగా తగ్గినప్పుడు శ్వాస సమస్యలు వస్తాయి, రక్తంలో చక్కెర తగ్గిపోతుంది. ఆహారం ద్వారా పొందిన శక్తి అంతా శరీరాన్ని వేడిగా ఉంచడానికే వినియోగ పడుతుంది. అందుకని వేడిని నిలకడగా ఉంచడానికి, సక్రమంగా ఉష్ణోగ్రతను నియంత్రించుకునే శక్తి వచ్చేదాకా శిశువును అదిగో, అలాంటి వార్మర్ లో ఉంచి సాకవలసి వస్తుంది.” అద్దంలో నుంచి కనిపిస్తున్న పక్క రూమ్ లోని వార్మర్ ని చూపించింది శ్రుతి.


“ప్లీటర్మ్ శిశువులకు జీర్ణవ్వవస్థ పూర్తిగా పరిణతి చెందక పోవడం వలన శిశువు పాలను తాగడం మొదలు పెట్టగానే లోపలి పొర కణాలు గాయపడతాయి. గ్లూకోజ్ నిలవలు తక్కువగా ఉండడం వలన పీటర్మ్ శిశువుల శరీరంలో గ్లూకోజ్ స్థాయి చాలా తక్కువ ఉంటుంది. వీరికి నిలవ ఉన్న గ్లూకోజ్ ని శరీరం ఉపయోగించగల రూపంలోకి మార్చే శక్తి తక్కువగా ఉంటుంది. పీటర్మ్ శిశువులకు రక్తహీనత, పచ్చకామెర్లు లేక జాండీస్ మొదలైన సమస్యలు వస్తాయి. నవజాత శిశువులందరికి మొదటి నెలలోపు ఎర రక్త కణాల సంఖ్య నెమ్మదిగా తగ్గుతుంది. పీటర్మ్ శిశువులకు మరీ ఎక్కువగా తగ్గుతుంది. వీటర్మ్ శిశువులలో వ్యాధి నిరోధక వ్యవస్థ పరిణతి చెందక పోవడం వలన ఇన్ఫెక్షన్లు సులభంగా సోకి రక్తం ద్వారా శరీరమంతటా పాకే ప్రమాదం ఉంటుంది.” ఇవన్నీ విపులంగా వేదకు చెప్పడం వలన ఆమె ఇంకా భయపడు తుందేమోనని కాసేపు సందేహించింది శ్రుతి. మళ్ళీ అంతలోనే తనే అడిగింది కదా, తెలుసుకుంటే మంచిదేలే అని సర్దిచెప్పుకుంది.


“నవజాత శిశువు మెదడుకు దెబ్బ తగలడం వలన సెరిబ్రల్ పాల్సీ అనే సమస్య రావచ్చు. నెలలయాక పుట్టిన శిశువుల కంటే పీటర్మ్ శిశువులు అభివృద్ధి మైలురాళ్ళ పరంగా వెనుకబడి ఉంటారు. చదువుకునే వయసు వచ్చాక తమ వయసు వారి కంటే అభ్యాసంలో, నేర్చుకోవడంలో వెనుకబడతారు. పీటర్మ్ శిశువులకు రెటినోపతీ సమస్య కారణంగా దృష్టి లోపం, ఒకోసారి అంధత్వం కూడా వస్తుంది. వినికిడి సమస్యలు ఎక్కువగా వస్తాయి. బాగా అనారోగ్యం పాలైన వీటర్మ్ శిశువులకు ఆలస్యంగా పళ్ళు వస్తాయి, పళ్ళ రంగు మారుతుంది, వంకర టింకర పళ్ళు వస్తాయి. వీటర్మ్ శిశువుల అభివృద్ధి ఆలస్యమవడమేగాక ప్రవర్తన, మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇన్ఫెక్షన్లు, అస్మా మొదలైన దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అకస్మాత్తుగా, ఊహించని విధంగా శిశువు చనిపోవచ్చు. దీనిని సడెన్ ఇన్సెంట్ డెత్ సిండ్రోమ్ అని అంటారు. ఏమిటీ భయమేస్తూందా, ఇవన్నీ అందరికీ వస్తాయనికాదు, రాగల ప్రమాదం వుంది. అంతే” శ్రుతి చెప్తూంది విన్న వేద మనసు వికలమయింది.


“ఇలా ముందస్తుగా పురుడు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చా మేడమ్ గారు?”


"గర్భానికి ముందు, గర్బాల మధ్య, గర్భం సమయంలో, ప్రసవమయాక నాణ్యమైన సంరక్షణ లభిస్తే వీటర్మ్ జననాలు, వీటర్మ్ శిశువుల మరణాలు తగ్గుతాయి. ప్రమాద సూచికలను త్వరగా గుర్తించడానికి నిర్ణీత వ్యవధిలో ఆరోగ్య సిబ్బందితో పరీక్షలు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి, మానసిక ప్రశాంతత మొదలైన అంశాల గురించి కౌన్సిలింగ్, రక్తహీనత, ఇన్ఫెక్షన్స్ మొదలైన వాటికి చికిత్స, గర్భనిరోధక సాధనాలు సులభంగా లభించడం, స్త్రీల సాధికారతను పెంచడం వీటర్మ్ జననాల్ని నివారించడానికి సహాయపడతాయి... ప్రొజెస్టరాన్ హార్మోన్ ని వాడడం సహాయపడొచ్చు . 4-6 నెలల మధ్య అనేక సార్లు గర్భస్రావం జరిగినప్పుడు, అల్ట్రాసౌండ్ పరీక్షలో సర్విక్స్ మరీ పొట్టిగా ఉన్నట్లు తెలిస్తే, సర్విక్స్ వదులయిపోయి నెలలు నిండకుండానే ప్రసవమయే ప్రమాదం ఉన్నప్పుడు ఎమర్జన్సీగా సర్విక్స్ కి కుట్టు వెయ్యవలసిరావచ్చు...ఇదంతా విని భయపడకు. సమస్య వివరాలు తెలుసుకోవడం మంచిదే. కాని, అంతా సవ్యంగా జరుగుతుందనే గట్టి నమ్మకంతో ఉండు. మళ్ళీ అలాగే జరుగు తుందేమోననే టెన్షన్ హాని చేస్తుంది” ... శ్రుతి ఓదార్పు, భరోసాతో వేద పడుతున్న వేదన క్రమేపీ పలచబడుతున్నప్పటికి కోపంతో జేవురించిన భర్త ముఖం అమె కళ్ళెదుట నిలుస్తూంది.