ప్రగతిశీల మహిళా సంఘం నడుపుతున్న రాజకీయ, సామాజిక, సాహిత్య పత్రిక మహిళల కరదీపిక మాతృక 1991లో ప్రారంభమై అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నది. పీఓడబ్ల్యు కార్యక్రమాల వివరాలను నివేదికలను సచిత్రంగా ఎప్పటికప్పుడు అందించిడం సందర్భోచితంగా సమస్యలపై సంపాదకీయాలు, వ్యాసాలు, కవితలు, కథలు, కథనాల రూపంలో సభ్యులకు విజ్ఞానాన్ని శాస్త్రీయ ఆలోచనా రీతులను పంచుతూ వారి ప్రతిస్పందనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు తీసుకురావడం జరుగుతున్నది.
మార్గదర్శకత్వం ఇచ్చి పోత్సహిస్తే రాయగలుగుతారన్న భావనతో మాతృక వర్క్ షాప్ నిర్వహించారు. పుట్టుకతో ఎవరూ రచయితలో కళాకారులలో కారని ప్రయత్నం, కృషి, నేర్చుకోవాలన్న తపన వుంటే ఎవరైనా రచనలు చేయగలుగుతారని ఔత్సాహికులకు వర్థమాన రచయితలకు సూచనలు, మెలుకువలు ఇవ్వడం ద్వారా పోత్సహించడం ఈ వ షాప్ ప్రధానోద్దేశ్యం.
నవంబరు 23, 24వ తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో మర్చెంట్స్ చాంబర్ భవనంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పీఓడబ్ల్యు సభ్యులకు ఉమ్మడిగా వ షాపు నిర్వహించారు. ఈ ఆంధ్రప్రదేశ్ నుండి కృష్ణా, గుంటూరు, ప్రకాశ్, విశాఖపట్నం, తెలంగాణ నుండి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం , కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, యాదాద్రి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, వికారాబాదు జిల్లాల నుండి 47 మంది పీఓడబ్ల్యు మహిళలు ఈ వర్క్ షాపులో పాల్గొన్నారు. ఆరు పదులు మొదలుకొని టీనేజి పిల్లల దాకా మూడు తరాల మహిళలు, యువతులు పాల్గొన్న ఈ శిక్షణా కార్యక్రమం రెండు రోజులు జరిగింది.
తేది 23.11.2019 ఉ|| 10.00 గంటలకు ప్రముఖ కవియిత్రి శ్రీమతి మందరపు హైమావతి ప్రారంభోపన్యాసంతో 'మాతృక' సంపాదక వర్గం కా|| ఝాన్సీ, రమ, అరుణ, లక్ష్మి, గంగాభవాని, అనసూయ గార్ల ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మందరపు హైమావతి తెలుగు సాహితీ లోకానికి సుపరిచితురాలైన స్త్రీవాద కవియిత్రి. కవితా కార్యశాలను ప్రారంభిస్తూ స్త్రీలు రచనా వ్యాసాంగాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. స్త్రీలు మౌనంగా ఉన్నన్నాళ్ళు స్త్రీల పట్ల పురుషులు చెప్పేదే / వ్రాసేదే 'నిజంగా' చలామణి అవుతుంది. ప్రాచీన సాహిత్యంలో ప్రబంద యుగంలో స్త్రీలను అబలలుగా, లతాంగులుగా, అలంకార వస్తువుగా బోగ వస్తువుగా వర్తించడం జరిగిందన్నారు. 'నీలి మేఘాలు' కవితా సంకలనంలో ఆడవాళ్ళు ఎంత బలంగా వ్యక్తీకరించగలరో ప్రపంచానికి తెలిసిందన్నారు.
ప్రారంభోపన్యాసం తరువాత ఆచార్య మల్లీశ్వరి కథా రచన గురించి బోధించారు. ఈ సెషను అనసూయ లక్ష్మి అధ్యక్షత వహించారు. ఒక సంఘటన గురించి క్షప్తంగా వివరిస్తే కథ అవుతుందని అనేక సంఘటనలు, పాత్రలు వైవిధ్యమైన జీవిత చిత్రణ నవల అవుతుందన్నారు.
రచయితలు పీడిత జనం పక్షాన ఉంటూ ప్రజా సమస్యలను ప్రతిబింబింపజేయాలి కథ వాస్తవాన్ని ఆధారంగా కల్పనను జోడించి చదివింపజేసేదిగా ఉండాలి. కథకు 'వస్తువు' ప్రాణ వాయువు వంటిది. 'శిల్పం' అలంకరణ. కథనం అనగా కథను నడిపే తీరు లేక నిర్మాణం. కథకు క్లుప్తత ప్రధానం. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, ఆసక్తికరంగా అనవసర పదాడంబరత లేకుండా పాఠకునికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ముగింపు కదిలించేదిగా వుండాలన్నారు.
కొత్తగా వ్రాస్తున్న వారు ప్రసిద్ధ రచయితల పుస్తకాలను సమీక్షలను విమర్శనా సాహిత్యాన్ని చదవాలి. వివిధ దేశాల భాషల సాహిత్యాన్ని అనువాదాలను అధ్యయనం చేయాలి. రచయిత సృష్టించే పాత్రలు ఘాడత కలిగి కలకాల చదువరుల మనసులో నిలిచి పోయేటట్టుగా వుండాలి. కథ అతి ప్రాచీన రచనా ప్రక్రియ, కథను హృద్యంగా చెప్పడంలో మహిళలు సిద్ధహస్తులు. ప్రయత్నిస్తే ప్రతి మహిళా ఓ మంచి రచయిత్రి కాగలదు. ప్రగతిశీల మహిళలు శాస్త్రీయ దృక్పథంతో, విలువలతో, వర్గ చైతన్యంతో ప్రజా ప్రయోజనం కొరకు రాయాలని మల్లీశ్వరి కోరారు. ఈ శిక్షణలో భాగంగా ఒక అంశం ఇచ్చి కథ రాయమని చెప్పారు. “ఆ రోజుతో ఆ తల్లి తన కూతురు చదువు మాన్పించింది” అన్న అంశం మీద నిర్ణీత సమయంలో కథ రాయమని చెప్పడం. ప్రతి ఒక్కరూ కథ రాశారు. తొలి ప్రయత్నంగా రాసిన వారు, చేయి తిరిగిన రచయిత్రలు భోజన విరామం తర్వాత ఒక్కొక్కరే తమ కథలను చదివి వినిపించారు. పేదరికం, నిరుద్యోగం, లింగ వివక్ష, బాల్య వివాహాలు లైంగిక హింస నిరక్షరాస్యత, డాపౌట్స్, మూఢ విశ్వాసాలు ఎయిడ్స్ ప్రేమలు కుటుంబ సమస్యలు వంటి వైవిధ్యమైన అంశాలపై కథలు వ్రాయడం జరిగింది. ప్రొ| మల్లీశ్వరి ఒక్కొక్క , కథను విశ్లేషించి సూచనలు సలహాలు ఇచ్చారు. కొత్త ప్రయత్నాలు అయినా 'కథలు' ఉత్తేజ భరితంగా, ఆలోచనాత్మకంగా, కదిలించేవిగా ఉన్నాయని అన్నారు.
తేది 24.11.2019 ఉ|| 9 గంటలకు ప్రముఖ గాయకుడుఉత్తరాంధ్ర పత్రిక సంపాదకులు సన్నిశెట్టి రాజశేఖర్ 'పాట రచన', గానం అన్న అంశాన్ని బోధించారు. ఈ సెషనకు పద్మ, కల్పన అధ్యక్షత వహించారు.
ప్రకృతిలోనే పాట వుందని పాటకు ధ్వని ప్రధానమని మొదట ధ్వని, పాట, మాట పుట్టాకనే లిపి పుట్టిందని, ఆదివాసుల జీవితాల్లో పాట ఒక భాగమని దు:ఖాన్ని సంతోషాన్ని ఆవేశాలను అన్ని రకాల భావోద్వేగాలను పాట ద్వారా వ్యక్తపరచడం సహజంగా వస్తుందన్నారు. ఆంధ్ర ప్రాంతంలో పాట, ఆట సకల కళారూపాలు వ్యాపారమై సినిమాలుగా రూపాంతరం చెందాయని తెలంగాణ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జనపదుల జీవితాల్లో పాట ఇంకా సజీవంగా వుందని, ఉద్యమాల్లో కూడా పాట కీలక పాత్ర పోషించిందని అన్నారు. సన్నిశెట్టి రాజశేఖర్ తన పదునైన గొంతుతో పాడిన పాటలు అందర్ని అలరించాయి. చివరగా “మోడిషా జోడయ్యారే దోపిడి మూకకు తోడయ్యారే” అనే పల్లవి ఇచ్చి పాట రాయమని చెప్పడం దానికి స్పందించి అనేక మంది పాటలు వ్రాశారు.
తరువాత సెషన్ వివిధ రచనా రీతులపై ప్రముఖ జర్నలిస్టు, రచయిత, చిరపరిచితులు సతీష్ చంద్ర గారు బోధించారు. ఈ సెషన్కు ఝాన్సీ, రమ అధ్యక్షత వహించారు. కథ, కవిత, నవల అతి ప్రాచీన రచనా ప్రక్రియలని... పూర్వం కథ కూడా పాట లేక పద్యం రూపంలోనే వుండేవని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన రచయితలు సృష్టించిన పాత్రలు నిత్యం ప్రజల నోళ్ళలో నానుతుండడం చూస్తూనే ఉన్నాం. అయిదు గంటలపాటు అనర్గళంగా సాగిన సతీష్ చంద్ర ప్రసంగం శ్రోతలను ఉ త్తేజపరిచింది.
సాయంత్రం ఆరు గంటలకు వ్యాస రచనా ప్రక్రియ మీద రమ బోధించారు. ఈ సెషను చండ్ర అరుణ, గంగాభవాని అధ్యక్షత వహించారు. అన్ని సాహిత్య ప్రక్రియల్లో వ్యాసరచన క్లిష్టమైనది, ప్రామాణికమైనది. విషయ సేకరణ, స్పష్టమైన భాష వ్యాసరచనకు అవసరం. చేయబడినది, చూడబడినది అంటూ కర్మపరంగా వ్రాసే వాక్యాలు చదువరులను గందరగోళానికి గురి చేస్తాయి. వ్యాసాలో | రిపోర్టులలో ఎవరు, ఎందుకు, ఎక్కడ ఎలా అన్నవి ముఖ్యం. వ్యాస రచయిత కల్పనపై కాకుండా సత్యాలపై ఆధారపడాలి. భాష మీద పట్టు, విషయ పరిజ్ఞానం వ్యాస రచనకు అవసరం.
చివరగా పీడీఎస్లు విద్యార్థులు చేసిన జార్జిరెడ్డి నృత్యం అందర్ని కదిలించింది. పీఓడబ్ల్యు సభ్యులు పాడిన పాటలు ఉత్తేజాన్ని కలిగించాయి.
ప్రతి స్పందనలో సభ్యులు ఇటువంటి కార్యశాలలు తరుచూ నిర్వహించాలని కోరారు. ఎడిటోరియల్ బోరు సభ్యులు ఈ శిక్షణా తరగతులకు సహకరించిన ఏలూరు డివిజన్ నిర్వాహకులకు ప్రాంగణాన్ని ఇచ్చిన మర్సెంట్స్ చాంబర్స్ వారికి మంచి భోజనం వసతులు కల్పించిన పార్టీ, సంఘ నాయకులకు విలువైన విషయాలు ఓపికగా బోధించిన మందరపు హైమావతి ఆచార్య మల్లీశ్వరి, సన్నిశెట్టి రాజశేఖర్, సతీష్ చంద్ర, రమ గార్లకు, వివిధ జిల్లాల నుండి వచ్చిన పీఓడబ్ల్యు సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెల్పారు.