-- కె. రమ....
వారు ఎగిసిపడుతున్న నిప్పురవ్వలు... కాదు కాదు నిప్పు కణికలు. నిద్రావస్థలో వున్న సమాజాన్ని మేల్కొలిపారు. స్థబ్దతలో వున్న సమూహాన్ని సమీకృతులమయ్యేలా చేశారు. యూనివర్సిటీలను ఉద్యమ కేంద్రాలుగా మలిచారు. మేధావి తనానికి నిజమైన అర్థం చాటారు. చైతన్య బావుటా ఎగురవేశారు. వారే జేఎన్‌యూ, జామియా, అలీఘర్ యూనివర్సిటీ విద్యార్థులు.
నేడు దేశంలోని యూనివర్సిటీలు రాజ్యాంగ, లౌకిక, ప్రజాస్వామిక విలువలను కాపాడే బాధ్యతను భుజానికెత్తుకున్నాయి. యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ కెరటాలవుతున్నారు. ఎంతో మంది మేధావులకు, ప్రగతిశీల శక్తులకు స్పూర్తినందిస్తున్నాయి. ప్రభుత్వం సంఘ్ పరివార్ శక్తులనూ, విధేయులనూ విద్యా సంస్థలకు అధిపతులుగా, పాలక మండళ్ళుగా నియమించింది. తద్వారా యూనివర్సిటీలను హిందుత్వ భావజాలంతో నింపాలనే కుట్ర, ప్రజాస్వామిక శక్తులను అణచివేసే కుట్ర దీనిలో దాగివుంది.
పేద విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను దూరం చేసేందుకు జేఎన్‌యూలో ఫీజులను విపరీతంగా పెంచింది. అంతేకాకుండా సామాజిక శాస్త్రం, జీవశాస్త్రం, మానవాభివృద్ధి విభాగాలను కుదించి అశాస్త్రీయ భావాలనూ, మూఢ నమ్మకాలనూ పెంచే అనేక కొత్త విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ విధానాలపై జేఎన్‌యూ విద్యార్థి లోకం నిరసన గళం విప్పింది. వేలాది మంది వీధుల్లో కొచ్చారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ప్రభుత్వం పాశవిక అణచివేతకు పూనుకుంది. అయినా విద్యార్థులు వెనుకకు తగ్గలేదు. మరింత దృఢమయ్యారు. చైతన్య దీపికలయ్యారు. తమ సమస్యలపైనే గాకుండా సీఏఏ, ఎస్ఆర్ సీలపై కూడా జేఎన్‌యూ విద్యార్థులు స్పందించడం ద్వారా మరో ముందడుగేశారు.
ఎస్ఆర్సీ, సీఏఏలపై స్పందించినందుకే జామియా యూనివర్సిటీలో పోలీసులు చొరబడి నానా బీభత్సం చేశారు. గ్రంథాలయంలో భయంతో దాక్కున్న విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. వందల మంది గాయపడ్డారు. ఈ దాడిపై కూడా జేఎన్‌యూ విద్యార్థులు స్పందించారు. వేలాది మందితో సమావేశాలూ, సభలూ, ధర్నాలూ జరపడం నిత్యకృత్యంగా మారింది. జేఎన్‌యూ విద్యార్థులు ప్రదర్శిస్తున్న ఈ చైతన్యం ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ఈ చైతన్యానికి అడ్డుపుల్ల వేయాలని పథకం వేశారు. ఆ పథకంలో భాగమే జేఎన్‌యూపై జనవరి 5న ముసుగు వ్యక్తుల దాడి. ముందుగానే ఆ ప్రాంతంలో విద్యుత్తును అపుజేసి మూడు గంటలపాటు ఇనుపరాడ్లతో అమానుష దాడికి పూనుకున్నారు. ఈ దాడిలో జేఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు.
ఆగ్రహించిన విదార్థి లోకం
భావాలు సంఘర్షణ తప్ప భౌతిక ఘర్షణలు ఎరుగని జేఎన్‌యు ఇప్పుడు రణరంగంగా మారింది. దానికి కారణం జేఎన్‌యు విద్యార్థులు పెంచిన ఫీజులను తగ్గించాలని గత రెండు నెలలుగా ఉద్యమ బాట పట్టడమే దీనికి కారణం. అంతేగాక ఎవరే సీ, సీఏఏలకు వ్యతిరేక కేతనం ఎగురవేయడంతో, వీరి పోరాటం దేశ వ్యాప్తంగా స్ఫూర్తి నందించడం కూడా ప్రభుత్వానికి భరించరానిదిగా తయారైంది. అందుకే ఉద్యమ కెరటాలపై అమానుష దాడికి పూనుకున్నారు. స్వయంగా ఈ దాడికి పాల్పడిన వారే ఈ దాడి చేసింది మేమేనని ప్రకటించారు. అయినా వారిపై ఇంత వరకు ఎలాంటి చర్య లేక పోవడం గమనార్హం. -
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అయిషీ ఘోష్ మాట్లాడుతూ “మీరు మాపై ఇనుపరాడ్లతో దాడి చేస్తే, మేము డిబేట్ తో సమాధానం చెపుతాం” అని మాట్లాడడం అమె రాజకీయ పరిణతిని తెలియజేస్తోంది. ఈ దాడితో విద్యార్థులే కాదు. ఎందరో ప్రొఫెసర్లు గాయపడ్డారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడాన్ని సైతం అడ్డుకున్నారు. అంబులెన్స్ టైర్ల గాలితీసి అద్దాలు పగులకొట్టి నానా బీభత్సం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం. ఆ సమయంలో విద్యుత్తు పోవడం, ఇంటర్నెట్ సౌకర్యం నిలిచి పోవడం ఎవరి మాయో తెలియనిది కాదు. రాత్రి ఏడు గంటలకు మొదలైన దాడి 9 పది గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది. ఈ దాడి ముగిసిన తరువాత ఆ మూక సురక్షితంగా నిష్క్రమించాక గానీ వీధి దీపాల వెలగలేదు. సినిమా చివరలో పోలీసులు రంగ ప్రవేశం చేసినట్లుగా అప్పుడు పోలీసులు చేరుకున్నారు. దీనిని బట్టి ఇదంతా ఒక ప్లాను ప్రకారం సాగిన, సాగించిన క్రూర దమన, అమ్మానుష దాడి అనేది స్పష్టం.
ఈ దాడి ఘటన ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. దేశ రాజధానిలోని ఎంతో చారిత్రిక ప్రాధాన్యత వున్న జేఎన్‌యుపై జరిగిన దాడి విద్యార్థి లోకంలో అగ్రహ జ్వాలను రగిలించింది. దేశం యావత్తు అట్టుడికి పోయినా యూనివర్సిటీ, కాలేజీల విద్యార్థులు ముక్తకంఠంతో ఈ దాడిని ఖండించారు. అంతేకాదు. ఎందరో సినీ ప్రముఖులు, మేధావులు జేఎన్‌యుపై ఏబీవీపీ గుండాల దాడిని ఖండించడం విశేషం. బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొనే దాడికి గురైన అయిష ఘోషను పరామర్శించడం వివాదాస్పదంగా మారింది.
దీపికా పదుకునే హీరోయిన్‌గా నటించిన 'చపాక్' సినిమా విడుదల అవుతున్న సమయంలో జేఎన్‌యూకు వెళితే వివాదం అవుతుందని తెలిసినా, తాను విమర్శలకు గురవుతానని తెలిసినా అక్కడికి వెళ్ళడం, సంఘీభావం తెలపడం ప్రశంసనీయం. జేఎన్‌యూ దాడిపై ప్రముఖ ఆర్థిక వేత, నోబుల్ బహుమతి గ్రహీత అమర్థ్వసెన్ మాట్లాడుతూ ఈ ఘటనలో తనకు భయం వేసిందని తెలిపారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇస్తే వివక్ష కిందకే వస్తుందని కూడా అన్నారు.
జేఎన్‌యూ దాడిని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ, విద్యార్థి సంఘాలూ, సినిమా తారలు పలువురు ముక్తకంఠంతో ఖండించారు. బాంబే ఐఐటీ ఫూణే ఫిల్మ్ వర్సిటీ, ఢిల్లీ, అంబేద్కర్, జామియా మిలియా, బెనారస్, అలహాబాద్, పంజాబ్, జాదసిపూర్ యూనివర్సిటీ, బెంగుళూరులోని నేషన్స్ లా యూనివర్సిటీ విద్యార్థులు, హైదరాబాద్లోని ఓయూ, హెచ్ సీయూ, మను, ఇఫ్లూ, టాటా ఇన్స్టిట్యూట్ తోపాటు పలు కాలేజీలు జేఎన్‌యూ దాడిని గొంతెత్తి నిరసించాయి. జేఎన్‌యూ విద్యార్థులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బెంగుళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, విద్యార్థులు, ప్రొఫెసర్లు ఖాళీ పోస్టర్లను ప్రదర్శిస్తూ చెప్పులు వరుసగా వదిలి లోనికి వెళ్ళడం ద్వారా ఎన్నార్‌సీకి, సీఏఏకి వ్యతిరేకంగా వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు.
వెల్లి విరిసిన అంతర్జాతీయత
మన దేశంలోని యూనివర్సిటీ విద్యార్థులే కాదు. విదేశాలలోని యూనివర్సిటీలు కూడా జేఎన్‌యూపై దాడిని ఖండించడం, నిరసన తెలపడం విశేషం. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, లండన్ లోని ఆక్స్ ఫర్డ్ విద్యార్థులూ జేఎన్‌యూ దాడిని ముక్తకంఠంతో ఖండించాయి.
జేఎన్‌యూ విద్యార్థులపై దాడులు, మత వివక్షతో కూడిన ఎస్ఆర్ సీ, సీఏఏలను వ్యతిరేకిస్తూ లండన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట ఈ నెల ఎనిమిదన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీ దేశాన్ని మత ప్రాతిపదికపై విభజించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎస్ఆర్ సీ, సీఏఏలతో భారతదేశం అగ్నిగుండంగా మారింది. ఎక్కడ చూసినా, మోడీ షాల ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మత ప్రాతిపదికపై పౌరసత్వాన్ని ఇవ్వాలనే దురాలోచనపై పలువురు ప్రముఖులు గళం విప్పడం గమనార్హం. మున్నెన్నడూ లేని స్థాయిలో సినీ ప్రముఖులు, మేధావులు గొంతెత్తి ప్రభుత్వ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీలతోపాటూ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సైతం ఎన్నార్సీ, సీఏఏలను వ్యతిరేకిస్తున్నాయి. సుమారు పద్నాలుగు రాష్ట్రాలు ఎన్నార్సీని అమలు చేయబోమంటూ ప్రకటించడం విశేషం. నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ జేఎన్‌యూ పరిణామాలు నాజీల కాలం పరిస్థితులను పోలి వున్నాయని వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
అంతేకాదు. భారత ఆర్థిక గణాంకాల శాఖలో సభ్యుడిగా నియమితుడైన జేఎన్‌యూ ప్రొఫెసర్ సి.పి. చంద్రశేఖర్ ఆ ప్రభుత్వం నియమించిన ప్యానెల్ నుండి వైదొలిగారు. జేఎన్‌యూలో విద్యార్థులపై అద్యాపకులపై ఏబీవీపీ చేసిన దౌర్జన్యకాండ అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీనిపై చంద్రశేఖర్ స్పందిస్తూ “విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వంలో తాను పని చేయలేనని, ఈ ప్రభుత్వం జాతీయ జనాభా పట్టికనూ, జాతీయ పౌర పట్టికతో అనుసంధానం చేయాలని చూస్తున్నదని, ఇలాంటి ప్యానెల్ లో తాను భాగస్వామి కాకూడదనే నేను రాజీనామా చేస్తున్నాను” అన్నారు. ఇలా ఎందరో ప్రముఖులూ తమ అవేదననూ, భయాన్ని, బాధనూ వ్యక్తం చేయడం గమనార్హం.
దేశ, విదేశాల్లో ప్రభుత్వం పట్లా, దాని అప్రజాస్వామిక చర్యల పట్లో పెద్ద యెత్తున నిరసన వ్యక్తం అవుతున్నా ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గన్నట్లుగా దాడికి గురైన బాధితులపైనే కేసులు పెట్టింది. దాడి చేసిన వారే ప్రకటించినా ఇంత వరకు అరెస్టు చేయక పోవడం విడ్డూరం. రాజ్యాంగాన్ని, లౌకికతత్వాన్ని ఖూనీ చేస్తున్నది. కనుక మరింత పటిష్టమైన, సంఘటితమైన ఉద్యమాన్ని నిర్మించాలి. బీజేపీ మినహా అందరూ ప్రభుత్వ విధానాలపై ఉద్యమ బావుటా ఎగురవేయాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం హిందుత్వ ధోరణులకు అడ్డుకట్ట వేయగలుగుతాం. నేడు మతాలను ముందుకు తెచ్చిన వారు రేపు కులాలను మధ్య చిచ్చు పెడతారు. కనుక ఇప్పుడే ఆ ధోరణులకు అడ్డుకట్ట వద్దాం ..